న్యూఢిల్లీ: ఈ నెల 11న జరిగిన శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో రాజస్థాన్, జమ్ముకశ్మీరు అధికార పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో అంటా స్థానాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ గెలుచుకుంది. జమ్ముకశ్మీరులోని బుడ్గాంలో అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు ప్రతిపక్ష పీడీపీ పరాజయాన్ని రుచి చూపించింది. ఈ స్థానంలో ఎన్సీ ఓడిపోవడం ఇదే తొలిసారి. జమ్ముకశ్మీరులోని నగ్రోటా స్థానాన్ని ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకుంది.
మిజోరం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎంఎన్ఎఫ్ డంప స్థానాన్ని నిలబెట్టుకుంది. అధికార జెడ్పీఎం అభ్యర్థిని 562 ఓట్లతో ఓడించింది. ఒడిశాలోని నౌపడలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై అధికార బీజేపీ విజయం సాధించింది. పంజాబ్‌లోని తరణ తరణ్ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. జార్ఖండ్‌లోని ఘట్సిల నియోజకవర్గంలో అధికార జేఎంఎం ప్రతిపక్ష బీజేపీని ఓడించింది.