PM Modi | హైదరాబాద్ : భారత్‌లో త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కల సాకారం కానుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఆధునిక హంగులతో నిర్మితమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సోమన్న, కిషన్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును రూ. 428 కోట్లతో చేపట్టారు. 19 ట్రాక్‌లు, ఐదు లిఫ్ట్‌లు, ఐదు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మెట్రో నెట్ వర్క్ 1000 కి.మీ. పైగా పరిధి విస్తరించింది. రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. జమ్మూకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్తగా కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం. నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోంది. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టాం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ వంటి సౌకర్యాలు కల్పించాం. హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. త్వరలోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుంది. కోట్లాది మంది ప్రజలను వందే భారత్ రైళ్లు గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. గడిచిన పదేండ్లలో 30 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను నిర్మించాం. భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాం. దశాబ్ద కాలంలో రైల్వే కొత్తరూపం సంతరించుకుంది. రైల్వే ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోంది అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు..!
KTR | కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది : కేటీఆర్