అది 2002.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం.. మహెసాణ జిల్లాలోని ఖేరాలుకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలతో.. ‘మీరు రమీలాబెన్కు ఓటెయ్యండి. నేను చిమ్నాబాయి సరోవర్‌ను నీటితో నింపుతాను’ అని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి సరిగ్గా 21 ఏండ్లు గడిచిపోయాయి. ఓట్లు వేయించుకున్న మోదీ.. సరస్సును మాత్రం ఇప్పటికీ నింపలేదు. ఇది కాని పని అని, 50 వేల మంది మహిళలు.. ‘అయ్యా! మోదీ గారూ.. ఇదుగో మీ హామీ’ అని లేఖాస్త్రం సంధించారు. మీ హామీ ఎక్కడికి పోయిందని నిలదీశారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్, మధ్య, దక్షిణ గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఓ నివేదిక ప్రకారం 20కి పైగా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వారానికి రెండుసార్లు నీరు సరఫరా చేయడం గగనంగా మారింది. 14 జిల్లాల్లోని సుమారు 500కి పైగా గ్రామాల్లో ఇప్పటికీ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు.
కలుషిత నీరు తాగుతున్న ప్రజలు
గుజరాత్ సీఎంగా మోదీ నీటి సమస్యకు పరిష్కారం చూపుతానని వాగ్దానం చేశారు. ఆయన మాట ఇచ్చి 20 ఏండ్లు గడిచినా ఖోడా గ్రామంలో ఇప్పటికి కలుషిత నీటి సమస్య అలాగే ఉండటం శోచనీయం. దీనిపై ఉత్తర గుజరాత్‌లోని కర్మావడ్ సరస్సు, ముక్తేశ్వర్ డ్యాం పరిసర ప్రాంతాల్లోని 125 గ్రామాల ప్రజలు మోదీకి లేఖ రాశారు. అయినా మోదీ, బీజేపీ ప్రభుత్వంలో చలనం రాలేదు.
మండు వేసవిలో నిండుకుండలా తెలంగాణ
మరోవైపు కొత్త రాష్ట్రమైన తెలంగాణ తాగు, సాగునీటి రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఎండిపోయిన చెరువులు, సరస్సులు చరిత్రలో కలిసిపోయాయి. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందుతున్నది. ఈ ప్రగతి సాధించడానికి సీఎం కేసీఆర్‌కు 20 ఏైండ్లెతే పట్టలేదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ను పరుగులు పెట్టించారు. తద్వారా మండు వేసవిలోనూ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, కుంటలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ ప్రగతిని 9 ఏండ్లలోనే చేసి చూపెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గుట్టలపై ఉన్న ఐదు దోనలతండా తాగునీటి కోసం దశాబ్దాలపాటు తండ్లాడింది. ఫ్లోరైడ్ నీళ్లతో బాధ పడింది. ఇలాంటి దుస్థితికి మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ చరమగీతం పాడింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి గిరిజనం దాహార్తి తీరుస్తున్నది. కృష్ణా నీటిని రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నది. ముచ్చర్ల వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో శుద్ధిచేసి, పటేల్‌చెరువు తండావద్ద ఉన్న పంపులోకి అక్కడ నుంచి ఐదు దోనలకు పరఫరా చేస్తున్నది.