Mamata Benerjee | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: విపక్ష ఇండియా కూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ, సీపీఐ(ఎం) మధ్య లొల్లి మొదలైంది. బెంగాల్లో సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేసేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతున్నది. సీపీఐ(ఎం) కావాలో, తామూ కావాలో తేల్చి చెప్పాలని కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీచేసింది. బెంగాల్ కాంగ్రెస్ నాయకుల తీరు తృణమూల్‌ను తీవ్రంగా నిరాశపరుస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకులు విమర్శిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని బెంగాల్ కాంగ్రెస్ టార్గెట్ చేయటాన్ని తృణమూల్ నేతలు తప్పుబడుతున్నారు. ఈడీ దాడుల్ని ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీపై సీపీఎం అనేక ఆరోపణలు చేయగా, బెంగాల్ కాంగ్రెస్ కూడా వారికి తోడైందని తృణమూల్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌కు ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని తృణమూల్ నిర్ణయించుకుంది.
భోపాల్ ర్యాలీ రద్దు…
ఇండియా కూటమి అక్టోబర్‌లో నిర్వహించతలపెట్టిన భోపాల్ ర్యాలీ రద్దు అయింది. ర్యాలీని రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ శనివారం ప్రకటించారు. మరోవైపు పలువురు జర్నలిస్టులపై ఇండియా కూటమి నిషేధం విధించగా.. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సదరు జర్నలిస్టులకు ఆయన మద్దతు ప్రకటించారు.