Manipur | న్యూఢిల్లీ/ఇంఫాల్, జూన్ 17: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. దాదాపు నెలన్నర రోజులుగా నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్నది. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో? ఏ బాంబు పేలుతుందో? ఎక్కడ తుపాకీ పేలుతుందో? ఏ వైపు నుంచి దాడులు చేస్తారో? ఏ ఇంటికి మంట పెడుతారో? అనే భయాందోళనతో మణిపూర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. మణిపూర్ హింసాకాండలో ఇప్పటికే 120 మందికి పైగా చనిపోగా, దాదాపు 500 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా వేలాది మంది రాష్ట్ర పౌరులు ఇతర ప్రాంతాలకు వలసపోయి తలదాచుకొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.
మణిపూర్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడంలో కేంద్రం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయన నోరు విప్పాలని, సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఘర్షణలతో మణిపూర్ మండిపోతుంటే.. మరోవైపు ఇదే సమయంలో మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మునిగితేలారనే విమర్శలు ఉన్నాయి.
మణిపూర్‌లో బీజేపీ మంత్రులు, నేతల ఇండ్లు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. సంక్షోభ పరిష్కారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార బీజేపీ నేతలు చొరవ చూపడం లేదని నిరసనకారులు మండిపడుతున్నారు. గురువారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిరసనకారులు నిప్పంటించారు. తాజాగా రాజధాని ఇంఫాల్‌లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు రాష్ట్ర మంత్రి బిశ్వజిత్ సింగ్‌కు చెందిన తోంగ్జు అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయానికి నిప్పు పెట్టారని పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి సమయంలో శారదా దేవి ఇంటి వద్దకు పెద్దయెత్తున చేరుకొన్న నిరసనకారులు దాడికి యత్నించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి, గుంపును చెదరగొట్టారు. బిశ్వజిత్ సింగ్ కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. సింజెమై వద్ద ఉన్న బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేశారు.
పలుచోట్ల భద్రతా బలగాలతో సాయుధుల ఘర్షణకు దిగారు. ఇంఫాల్‌లో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వక్తా, చురాచాంద్‌పూర్‌లోని కాంగ్వైలో శుక్రవారం రాత్రి జరిగిన వేర్వేరు ఘటనల్లో భద్రతా బలగాలు, సాయుధ మిలిటెంట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంఫాల్‌లోని ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని భవనాలకు నిప్పు పెట్టేందుకు దాదాపు వెయ్యి మంది ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బలగాలు టియర్‌గ్యాస్, రబ్బర్ బులెట్లును ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కాగా, మణిపూర్‌లో హింసకు అస్సాం రైఫిల్సే కారణమంటూ వ్యాఖ్యలు చేసిన ఐపీఎఫ్ఎం నేత జగత్ తౌదంపై ఇంఫాల్ వెస్టు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మరోవైపు గిరిజన నేతల గ్రూపు ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ఐటీఎల్ఎఫ్) మీడియా సెల్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేశారు. గిరిజనుల గొంతు అణచివేత కొనసాగింపులోనే ఈ షాకింగ్ సెన్సార్షిప్ విధించారని గ్రూప్ శనివారం పేర్కొన్నది.
మణిపూర్ హింసాకాండకు బీజేపీ విభజన రాజకీయాలే కారణమని దాదాపు 550 పౌర సంఘాలు తాజాగా పేర్కొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ ‘చెవిటి మౌనం’ వీడాలని డిమాండ్ చేశాయి. సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉన్నదని ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రకటనపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఝార్ఖండ్ జనాధికార్ మహాసభ, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్, తదితర సంఘాలతో పాటు రిటైర్డ్ ఉన్నతాధికారులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు సంతకాలు చేశారు.
మణిపూర్ పరిస్థితులపై నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి యుమ్నం జాయ్‌కుమార్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ంలో పరిస్థితులు మెరుగుకాని పక్షంలో బీజేపీతో పొత్తుపై తమ పార్టీ పునరాలోచన చేస్తుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించారు. సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళిక తీసుకోలేదని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉన్నదని స్పష్టం చేశారు.
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల వేళ ‘ప్రత్యేక రాష్ట్రం’ డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని, దీనికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ రాష్ర్టానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గత నెల కేంద్రానికి లేఖ రాశారు. వీరిలో బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర సీఎం బీరేన్‌సింగ్ ఈ డిమాండ్‌ను తిరస్కరించిన కొద్ది గంటల్లోనే, వీరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్రంలో హింసకు సీఎం బీరేన్‌సింగ్ వ్యూహాత్మకంగా మద్దతుగా ఉన్నారని వారు ఆరోపించారు. గిరిజనులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మెజార్టీలుగా ఉన్న మైతీలకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అండగా ఉన్నదని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మణిపూర్‌లో పరిస్థితులకు బీజేపీ స్వార్థ రాజకీయాలే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైతీలకు ఎస్టీ హోదా పేరుతో అధికార బీజేపీ చిచ్చు రాజేసిందనే విమర్శలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కుకీలు, నాగాలు వ్యతిరేకిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో మణిపూర్‌లో మెజార్టీలుగా ఉన్న మైతీలను ప్రసన్నం చేసుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదనే విమర్శలు ఉన్నాయి.
మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ నోరు ఎందుకు పెగలడం లేదని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. నెలన్నర రోజులుగా ఘర్షణలతో రాష్ట్రం మండిపోతున్నా ఆయన మౌనంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా రాష్ట్రంలో ‘మోదీ కనపడటం లేదు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ‘ఈయన్ను ఎక్కడైనా చూశారా?’ అంటూ మోదీ ఫొటోను అందులో ముద్రించారు. ఇదే సమయంలో 56 ఇంచుల చాతీ అని చెప్పుకొనే మోదీ ఎక్కడున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని భయానక పరిస్థితులు ఆయనకు కనిపించడం లేదా? ప్రజల ఘోష వినిపించడం లేదా? అని మండిపడుతున్నారు. చివరిసారిగా ప్రధాని మోదీని మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లోనే చూశామని పోస్టర్లో పేర్కొంటూ తమ నిరసన తెలిపారు.
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌనం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన నోరు విప్పాలని, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలని డిమాండ్ చేశాయి.
-శివసేన(యూబీటీ)
– ఆమ్ఆద్మీ
-ఎన్సీపీ
-కాంగ్రెస్