Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదా ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకైనా అప్పగించాలని సూచించింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ శుక్రవారం ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడని ఆరోపణలున్నాయి. దీనిపై గత ఏడాది డిసెంబర్ 17న రాయ్‌బరేలిలోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను కోర్టు లక్నో కోర్టుకు మార్చింది. ఈ పిటిషన్‌ను లక్నో కోర్టు డిస్మిస్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక బీజేపీకి చెందిన నేత విఘ్నేశ్ శిశిర్.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, అందువల్ల ఆయనపై అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, ఫారెనర్స్ యాక్ట్, పాస్‌పోర్ట్ యాక్ట్ కింద బీఎన్ఎస్ ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన అలహాబాద్ హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సూచించింది.
రాహుల్ గాంధీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చాలాకాలంగా దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందన్నారు. అక్కడి ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నట్లు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి చెప్పారు. ఇలా ఇండియాలో ఉంటూ, మరో దేశంలో పౌరసత్వం కలిగి ఉండటం నేరమని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు.