న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు చోట్ల చతికిలపడింది. దేశంలోని పెద్ద రాష్ట్రమైన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున ఘోసి స్థానంలో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధారాసింగ్ చౌహాన్‌ను కమలం పార్టీ గట్టెక్కించలేకపోయింది.
ఆ పార్టీ అభ్యర్థి చౌహాన్ ఏకంగా 42,759 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని ధూప్‌గురి స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి 4,300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఈ స్థానాన్ని అధికార టీఎంసీ గెలుచుకుంది. కాగా, ఝార్ఖండ్‌లోని దుమ్రి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీ ఏజేఎస్యూకు మద్దతు ఇచ్చిన బీజేపీ అక్కడ కూడా చతికిలపడింది.
ఈ స్థానాన్ని అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. 17,000 ఓట్ల మెజారిటీతో జేఎంఎం అభ్యర్థి బేబీ దేవి గెలిచారు. ఇక కేరళలోని సిట్టింగ్ స్థానం పుత్తుపల్లిని యూడీఎఫ్ కూటమి కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి పోటీలోనే లేకుండా పోయారు. కాగా, ఉత్తరాఖండ్, త్రిపురలోని తమ సిట్టింగ్ స్థానాలైన భాగేశ్వర్, ధన్‌పూర్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, త్రిపురలోని సీపీఐ(ఎం) సిట్టింగ్ స్థానమైన బాక్సానగర్ను కమలం గెలుచుకుంది.