న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 370కి సంబంధించి అధికారాల వినియోగం చెల్లుబాటు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదని ధర్మాసనం తెలిపింది.
ఆర్టికల్ 370, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019లోని నిబంధనలు రద్దు చేసి, జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటును జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం వ్యతిరేకించడం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి పిటిషన్లను రద్దు చేసింది.