Karnataka | బెంగళూరు, జూన్ 13: ఐదు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఈ గ్యారెంటీలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓట్లు రాల్చలేదు. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని, లబ్ధిదారులు తమనే గెలిపిస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు నమ్మారు. అయితే, రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కు కేవలం తొమ్మిది మాత్రమే దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 19 సీట్లు దక్కించుకుంది.
ఊహించని ఈ ఫలితం కన్నడ కాంగ్రెస్ నేతలకు షాకిచ్చింది. ఐదు గ్యారెంటీలపై పెట్టుకున్న ఆశలు నెరవేరకపోవడంతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. నిధులన్నీ గ్యారెంటీల అమలుకే ఖర్చు అవుతున్నాయని, ఫలితంగా అభివృద్ధి జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, మరోవైపు గ్యారెంటీలు అందుకున్న లబ్ధిదారులు ఓట్లు వేయడం లేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదు గ్యారెంటీలపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
మొదట బాగల్కోట్ ఎమ్మెల్యే జేటీ పాటిల్ ఈ వాదనను తెరపైకి తీసుకురాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సమర్థించారు. గ్యారెంటీల వల్ల జనం సోమరులుగా మారుతున్నారని బీజేపీ పదే పదే చెప్పిన మాటలనే జనం సమర్థించారని, గ్యారెంటీలను ఇష్టపడటం లేదని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలే ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఇక గ్యారెంటీలకు ముగింపు పలికేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే పథకాలు పొందుతూ తమకు ఓట్లు వేయలేదని ప్రజలపై పరోక్షంగా ఆగ్రహాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తున్నదని విశ్లేషిస్తున్నారు.