న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: వక్ఫ్(సవరణ) బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధా విశ్రమ్ కుల్కర్ణి నివేదికను ప్రవేశపెట్టారు. అయితే, జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు.
నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అయితే, భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇది ఫేక్ నివేదిక అని, మెజారిటీ సభ్యుల ఆలోచనలనే నివేదికలో పొందుపర్చడం అప్రజాస్వామికమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాగా, నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్‌కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. మార్చి 10 ఉదయం 11 గంటలకు రాజ్యసభను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ధన్కడ్, లోక్‌సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రకటించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద 173 మంది ఎంపీలు, బడ్జెట్‌పై చర్చలో 170 మంది ఎంపీలు మాట్లాడారని స్పీకర్ తెలిపారు.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ ఇచ్చిన నివేదికను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లింల అభిప్రాయాలను ఈ కమిటీ పూర్తిగా విస్మరించిందని, ఏకపక్షమైన అప్రజాస్వామిక ప్రక్రియను అవలంబించిందని లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు పాసయితే, దానిని వ్యతిరేకిస్తూ రాజ్యాంగబద్ధంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.