న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే అధికారాన్ని భారత ప్రభుత్వం గణనీయంగా పరిమితం చేసింది. ప్రత్యేకించి ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ తో నెలకొన్న న్యాయ వివాదం నేపథ్యంలో, ఈ అధికారాన్ని ఉపయోగించే అధికారుల పరిధిని తగ్గిస్తూ కీలక సవరణలు చేసింది. కర్ణాటక హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎక్స్ సవాలు చేసింది.
దీంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తన విధానాన్ని సవరించింది. ఇకపై కంటెంట్ తొలగింపు ఆదేశాలు జారీ చేసే అధికారం కేవలం ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఉంటుంది. జాయింట్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకు అధికారులు, పోలీసు విభాగంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకు అధికారులకు మాత్రమే ఈ అధికారాన్ని పరిమితం చేసింది.