సిమ్లా, అక్టోబర్ 4: ‘టాయ్‌లెట్ ట్యాక్స్’పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లపై రూ.25 చొప్పున పన్ను వసూలు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అలవికాని హామీలు ఇచ్చి హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ర్టాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది.
ఉద్యోగులకు సమయానికి వేతనాలు సైతం ఇవ్వలేకపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలపైనే భారం వేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే విధించిన టాయ్‌లెట్ ట్యాక్స్‌పై రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.