న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నెట్టేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు లక్షన్నర కోట్లు దాటడమే ఇందుకు నిదర్శనం.
2022 సెప్టెంబర్ చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు డిసెంబర్ చివరి నాటికి మరో 2.6% పెరిగి రూ.150.95 లక్షల కోట్లకు చేరినట్టు తాజా నివేదికలో ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో రూ.3.18 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆ మాటను తుంగలోతొక్కి రూ.3.51 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు ఆ నివేదిక తెలిపింది.