పాట్నా, నవంబర్ 7: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ ఎన్నికల కమిషన్(ఈసీ) చేసే సిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక ఓటరుకు ఒకే ఓటు ఉంటుందన్న నిబంధనకు నీళ్లొదిలిన ఈసీ.. అధికార పక్షానికి కొమ్ము కాస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చే తాజా ఘటన గురువారం చోటుచేసుకుంది. బీహార్లోని సమస్థిపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) ఎంపీగా కొనసాగుతున్న శాంభవీ చౌదరి గురువారం అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన ఆమె తన చూపుడు వేలుకు అద్దిన సిరా చుక్కను చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె రెండు చేతుల్లోని చూపుడు వేలుకు సిరా చుక్క ఉండడం నెటిజన్లలో అనుమానాలు లేవనెత్తింది. ఆమె రెండుసార్లు ఓటు వేసినట్లు కొందరు నెటిజన్లు ఆరోపించగా పోలింగ్ సిబ్బంది చేసిన తప్పు కావచ్చంటూ మరి కొందరు ఆమెను సమర్థించారు.