Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కమీషన్ల యుద్ధానికి తెరలేచింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఒకరిపై ఒకరు కమీషన్ల ఆరోపణలు చేసుకుంటున్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్ తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ హెచ్ఎన్ నాగ్మోహన్ కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించింది. దీంతో ఇరు పార్టీల మధ్య రగడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 60 శాతం కమీషన్ తీసుకుంటున్నదంటూ విపక్ష బీజేపీ ఎదురు దాడికి దిగుతూ పోస్టర్ల యుద్ధాన్ని ప్రారంభించింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫొటోను ఉంచి ‘పగలు-రాత్రీ దోచుకోండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా, 40 శాతం కమీషన్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్ళిలో గురువారం మాట్లాడుతూ దీనిపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, నివేదికను సభకు సమర్పించాలని డిమాండ్ చేశారు. కమిషన్ విచారణ జరిపిన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. దీనిపై ఎవరికి నోటీసులు ఇచ్చారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరూ నోటీసులు అందుకోలేదని అన్నారు. నోటీసులు ఇస్తే తాము దానికి తగు రీతిలో స్పందిస్తామని, ఇలాంటి వట్టి బెదిరింపులను లెక్కచేయమని అన్నారు. కాగా, జస్టిస్ నాగ్మోహన్ సమర్పించిన నివేదిక అందిందని, దీనిపై నేడు మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉందని మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తెలిపారు.