న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో కేంద్రం గురువారం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9న సీఎం బీరేన్ సింగ్ రాజీనామా సమర్పించటం, ఆ వెంటనే గవర్నర్ నివేదిక రాష్ట్రపతికి చేరటం వెంట వెంటనే జరిగిపోయాయి. ‘మణిపూర్ గవర్నర్ అందజేసిన నివేదికతోపాటు ఇతర నివేదికల సమాచారం పరిశీలించాక, అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే నిర్ధారణకు వచ్చాం.
ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నాం’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో మణిపూర్ శాసనసభ సుప్త చేతనావస్థలో వెళ్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై విపక్ష కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ స్పందిస్తూ, ‘రాష్ట్రంలో సామాజిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయాక, 60వేల మంది నిరాశ్రయులయ్యాక రాష్ట్రపతి పాలన విధించారు’ అని ఆయన విమర్శించారు. కాగా, రాష్ట్ర శాసనసభ రద్దు కాలేదని, పరిస్థితులు మెరుగుపడ్డాక రాష్ట్రపతి పాలన ఎత్తేస్తారని మణిపూర్ బీజేపీ చీఫ్ ఏ శారద అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2027తో ముగియనున్నది.
ఇక్కడ గత 21 నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు, హింస కారణంగా దాదాపు 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సీఎం పదవికి బీరేన్‌సింగ్ రాజీనామా చేశాక, సీఎం అభ్యర్థిని ఎంపిక చేయటంలో అధికార బీజేపీ విఫలమైంది. పార్టీ ఎమ్మెల్యేలతో ఇంచార్జ్ సంబిత్ పాత్ర పలు దఫాలుగా చర్చలు జరిపినా.. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది.