న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మూడు వారాల సెషన్లో మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయి. ఈ సమావేశాలు కీలకమైన సమయంలో జరుగుతుండటం వల్ల చర్చలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం తేదీలను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. 15 రోజుల్లో ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నదని ప్రశ్నించారు. వారికి చర్చించడానికి బిల్లులు లేవని, చర్చలు అనుమతించడానికి ఇష్టపడటం లేదని స్పష్టమవుతోందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం పార్లమెంట్ ఫోబియాతో బాధపడుతోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు డెరెక్ ఒబ్రియాన్ ఎద్దేవా చేశారు.