న్యూఢిల్లీ, మే 3: లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాలను వెల్లడించడంలో జరుగుతున్న జాప్యంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రానున్న ప్రతి దశ తర్వాత ఓటింగ్ శాతాల గణాంకాలను సకాలంలో వెల్లడించేందుకు కట్టుబడి ఉన్నామని శుక్రవారం పేర్కొన్నది. ఓటింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రాల వారీగా ‘పోలైన వాస్తవ ఓట్ల సంఖ్య’కు సంబంధించిన డాటా అభ్యర్థుల వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపింది.
అయితే తొలి దశ ఎన్నికలు జరిగిన 11 రోజులకు పోలింగ్ శాతాన్ని ప్రకటించడానికి గల కారణంపై ఈసీ స్పష్టత ఇవ్వలేదు. లోక్సభ తొలి దశ ఏప్రిల్ 19, రెండో దశ ఏప్రిల్ 26 జరుగ్గా.. ఆ రెండు దశలకు సంబంధించి తుది ఓటింగ్ శాతాలను ఈసీ 30న విడుదల చేసింది. అయితే ఎన్నికలు జరిగిన ఆయా రోజుల్లో ప్రకటించిన ఓటింగ్ శాతాలకు, ఇన్ని రోజుల ఆలస్యంగా విడుదల చేసిన తుది ఓటింగ్ శాతాలకు భారీ తేడా ఉండటంపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి.