న్యూఢిల్లీ, మే 29: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్‌తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్‌ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. తమ రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోనీయమంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ పక్క ఎన్నికల ప్రచారంలో పేర్కొంటుండగా, అమలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొంటూ వచ్చారు.
మొదటి విడత పౌరసత్వ సర్టిఫికెట్లను దరఖాస్తుదారులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మే 15న అందజేసింది. కాగా, ఆఖరి విడత ఎన్నికలు జరిగే జూన్ 1కి మూడు రోజుల ముందు బుధవారం రెండో విడత సర్టిఫికెట్లను కూడా అందజేశారు. ఈ ఏడో విడతలో బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనున్నది.