న్యూఢిల్లీ, డిసెంబర్ 7: చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్‌ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
2023-24 మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబర్-సెప్టెంబర్)లో చక్కెర ఉత్పత్తి అంచనా తగ్గింది. దీంతో చెరకును ఇథనాల్ తయారీకి వాడటం వల్ల పంచదార ఉత్పత్తి తగ్గి తద్వారా దేశీయంగా ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉండటంతో అన్ని చక్కెర కర్మాగారాలు, డిస్టిలరీలకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.