Enforcement Directorate | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి మరిన్ని విస్తృత అధికారాలు కట్టబెట్టింది. రాజకీయ నేతలు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్ధలు, విదేశీ ప్రభుత్వాధినేతల ఆర్థిక కార్యకలాపాలపై కేంద్రం ఇకపై నిఘా పెట్టబోతున్నది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఎ) పరిధిని పెంచింది. వీరి ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా వర్గీకరిస్తూ సంబంధిత సమాచారాన్ని నిల్వ చేయాలని, అడిగినప్పుడు ఈడీకి డాటా ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
సవరించిన నిబంధనల మేరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రాజకీయ నేతలు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు నీతిఆయోగ్ నిర్వహించే దర్పన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఐదేండ్ల వరకు భద్రపరచాలి. ఈడీ అధికారులు అడిగినపుడు ఈ వివరాలను విధిగా అందజేయాలి. నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను తెలుసుకుని మరీ భద్రపరచాలని, ఆ బాధ్యత బ్యాంకులు, ఆర్థిక సంస్థలదేనని కేంద్రం స్పష్టం చేసింది. అంటే, ఈడీకి ఇచ్చిన ఆర్థిక లావాదేవీల డాటాలో ఏమైనా పొరపాటు దొర్లినా, విచారణలో భాగంగా ఏమైనా సమాచారం మిస్ అయినా.. ఆ బాధ్యత బ్యాంకులు, ఆర్థిక సంస్థలదేనని నిబంధనలను బట్టి తెలుస్తున్నది. బ్యాంకులే కాక క్రిప్టో ప్లాట్‌ఫారమ్, డిజిటల్ అసెట్స్ కేసినోస్ తదితర మధ్యమ సంస్థలూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నది.
రాజకీయాల్లో పేరున్న వ్యక్తులు అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ (పీఈపీ)గా పేర్కొంటూ.. ఈ పరిధిలోకి ఎవరెవరు వస్తారో కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది. ఇందులోకి విదేశీ ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు అప్పగించే పనులు నిర్వర్తించే ముఖ్యమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, న్యాయ, మిలటరీకి చెందిన అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే అత్యున్నత పదవుల్లోని కార్యనిర్వాహకులు, రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు వస్తారు. అలాగే స్వచ్ఛంద సంస్థల శ్రేణిలో లాభాపేక్షలేని సంస్థలు.. అం టే వ్యాపార సంస్థలు కాని ప్రభుత్వేతర సం స్ధలు, ఎన్జీవోలూ వస్తాయి.