న్యూఢిల్లీ, మే 14: దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. అధికారుల ప్రయాణాలు తగ్గించి చమురును ఆదా చేసేందుకు 50 శాతం అధికారిక సమావేశాలు ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.
ఢిల్లీ ప్రభుత్వంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూడా ట్రాఫిక్ రద్దీ తప్పించుకునేందుకు కార్యాలయ పనివేళల్లో మార్పు చేసింది. అధికారిక వాహనాల పెట్రోల్ వినియోగంలో 20 శాతం కోత విధించారు. అంతేకాకుండా మెట్రో డేను పాటించాలని, వారానికి ఒక రోజు ‘నో కార్ డే’ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణను ప్రోత్సహించేందుకు 29 ప్రభుత్వ కాలనీలలో 58 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ఇంటి నుంచి పని చేయడం, ఆన్లైన్ సమావేశాలు, వర్చువల్ సదస్సులపై మార్గ దర్శకాలను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకటి బుధవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో కేంద్ర సచివాలయ సేవల(సీసీఎస్) ఫోరమ్ ఈ అభ్యర్థన చేసింది.