న్యూఢిల్లీ, జూలై 30: సంపద సృష్టిలో మహిళా పారిశ్రామికవేత్తలు రాణిస్తున్నారు. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా హురున్ ఇండియా మహిళా సారథుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. మరోవైపు, రూ.5.06 లక్షల కోట్ల విలువైన కంపెనీకి నేతృత్వం వహిస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్ సీఈవో, ఎండీ ప్రియా యాన్ ప్రొఫెషనల్ సీఈవోల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నారు. 2026 సంవత్సరానికిగాను హురున్ ఇండియా మహిళా సారథుల జాబితా విడుదల చేయగా, దీంట్లో 117 మంది చోటు దక్కించుకున్నారు. అంతక్రితం ఏడాది 97 మంది ఉండగా, ఈసారి 21 శాతం పెరిగారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 12 మంది వృశ్చిక రాశి వారు ఉండటం విశేషం.
2025లో తొమ్మిది విభాగాల్లో మహిళా నాయకత్వంలోని విస్తృత కోణాలను ప్రతిబింబించేలా ఈ జాబితాను రూపొందించగా..ఈసారికిగాను ఈ పరిధిని పన్నెండు విభాగాలకు విస్తరించినట్టు పేర్కొంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 117 మంది మహిళా సారథుల మొత్తం విలువ రూ.39 లక్షల కోట్లుగా ఉన్నది. ఇది ఫిన్లాండ్ జీడీపీ కంటే అధికంగా ఉండటం విశేషం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో సరాసరి వయస్సు 48. అలాగే 19 ఏండ్ల నుంచి 86 ఏండ్లలోపు వారు ఉన్నారు.
ఈ జాబితాలో బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్‌షా, నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హురున్ ఇండియా ఫౌండర్, చీఫ్ రిసెర్చర్ అనస్ రహమాన్ జునైద్ మాట్లాడుతూ…దేశీయ ఆర్థిక వ్యవస్థ, సమాజం వైవిధ్యభరితంగా మారుతున్న తరుణంలో గుర్తింపుకోసం వేచి చూస్తూ, తదుపరి తరం మహిళా నాయకులు ఇప్పటికే కృషి చేస్తున్న తక్కువ ప్రాచుర్యం పొందిన రంగాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, అంతగా వెలుగులోకి రాని విజయాల వైపు మరింత విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.