హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రైతులకు నీరు, కరెంటివ్వకుండా సాగురంగంపై రేవంత్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మేందర్, పల్లా ప్రవీణ్, తుంగ బాలు, పడాల సతీశ్, రవికుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నారం, సుందిళ్ల బాగున్నాయని శాసనమండలిలో చెప్పిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో కాళేశ్వరంపై మూర్ఖపు మాటలతో అజ్ఞానిలా వ్యవహరించాడని నిప్పులు చెరిగారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుపై ముందు కెళ్తామని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదలకు ఎన్డీఎస్ఏ నివేదికకు ఏం సంబంధమని నిలదీశారు. మేడిగడ్డలో ఏదో జరిగిందని వచ్చిన ఎన్డీఎస్ఏ, ఎస్ఎల్బీసీ కుప్పకూలి ఎనిమిది మరణించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని సాగుకు దూరం చేసే పన్నాగానికి ఒడిగట్టిందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కర్ణాటక నుంచి వరద వస్తున్నా జూరాల నుంచి నీళ్లు పూర్తిస్థాయిలో ఎత్తిపోయడంలేదని తెలిపారు. రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో 2014కు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సాగుకు కరెంట్ ఇస్తే రైతులు పండించిన పంటలను కొనాల్సి వస్తుందనే దురుద్ధేశంతోనే రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తిని నిలిపివేశారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘కొత్తగూడెంలో 500 మెగావాట్ల కేంద్రాన్ని బంద్‌పెట్టారు.. యాదాద్రిలో నాలుగు ప్లాంట్లలో రెండే నడుపుతున్నరు.. సింగరేణిలో కోల్స్కామ్కు తెరలేపి థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను బంద్‌చేశారు..’అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత సీజన్లో 200 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసినట్టు చెప్పారు.
కాళేశ్వరం కుప్పకూలిందని, అది కూలేశ్వరమని దెప్పిపొడిచే రేవంత్.. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరుకు ఎట్లా ఎత్తిపోస్తున్నారు? లక్ష్మీపూర్, గాయత్రీ పంప్‌హౌస్‌లు కాళేశ్వరంలో భాగం కాదా? రేవంత్ వచ్చిన తర్వాతే లిఫ్ట్‌లు పెట్టారా? అని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం కండ్లు తెరిచి కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.