Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. ప్రధాని నరేంద్రమోదీతోపాటు మరో 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. వారిలో కొత్తగా ఏడుగురు నేతలకు మోదీ తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
వారిలో ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన జితిన్ ప్రసాద, గుజరాత్ లోని నస్వారి స్థానం నుంచి నాలుగోసారి గెలుపొందిన సీఆర్ పాటిల్ చోటు దక్కించుకున్నారు. సీఆర్ పాటిల్ ప్రస్తుతం బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు.
కేరళలోని త్రిసూర్ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన సురేశ్ గోపిని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేరళ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన తొలి నేత సురేశ్ గోపి.
తెలంగాణలోని కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బండి సంజయ్ మంత్రిగా ప్రమాణం చేశారు. 2019లో తొలిసారి గెలుపొందిన తర్వాత తెలంగాణ బీజేపీశాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. ఇక పంజాబ్ లోని లుధియానా నుంచి ఓటమి పాలైన బీజేపీ నేత రవ్ నీత్ బిట్టూకూ మోదీ తన మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి- విదిశ నుంచి గెలుపొందిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి – కర్నాల్ నుంచి గెలుపొందిన మనోహర్ లాల్ ఖట్టర్లనూ మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రపక్షం టీడీపీ నేతలు కే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నేత – నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మనూ మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.