Terrorists | దాయాది దేశం తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు నిఘావర్గాల హెచ్చరికలతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. దాదాపు 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పాక్ సరిహద్దు నుంచి జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రణాళికలు వేస్తున్నారని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులు సరిహద్దుల్లోని లాంచ్ప్యాడ్లో దాక్కున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు అధికారి పేర్కొన్నారు. సరిహద్దు చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేస్తుందని పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ యాదవ్ లాంచ్ప్యాడ్ల వద్ద 250-300 మంది ఉగ్రవాదులు ఉన్నారని నిఘావర్గాల నుంచి సమాచారం ఉందన్నారు. సైన్యం సున్నితమైన ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించామన్నారు. బీఎస్ఎఫ్, ఆర్మీకి చెందిన జవార్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటు ప్రయత్నాలు విజయవంతంగా అడ్డుకుంటామన్నారు.