న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20వ సంబరాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 6వ తేదీ తర్వాత జరిగిన ఆపరేషన్‌లో మృతిచెందిన వారికి పాకిస్థాన్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని, దీన్ని ప్రాక్సీ వార్‌గా గుర్తించలేమని మోదీ అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలపై పాకిస్థాన్ జాతీయ జెండాలను పరిచిందని, వాళ్లకు పాక్ మిలిటరీ కూడా సెల్యూట్ చేసిందని ఆయన చెప్పారు. దీని ద్వారా ఉగ్రవాద చర్యలను పరోక్ష యుద్ధంగా పరిగణించరాదు అని, ఇది కావాలని చేస్తున్న యుద్ధ వ్యూహాంగా భావించాల్సి వస్తుందని, ఒకవేళ వాళ్లు యుద్ధానికి దిగిగే, అప్పుడు మన సమాధానం కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.
దేశ విభజన సమయంలోనే ముజాయిదీన్‌లు ఏర్పడ్డారని, వాళ్లను అప్పుడే ఖతం చేస్తే ఈ సమస్య ఉండేది కాదు అని ప్రధాని పేర్కొన్నారు. కశ్మీర్లోకి ప్రవేశించిన ముజాయిదీన్లను 1947లోనే అంతం చేస్తే,ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్నారు. సింధూ నదీ జలాల విషయంలో కుదిరిన ఒప్పందంలో చాలా లోపాలు ఉన్నాయని, సరైన రీతిలో ఆ నదీ జలాల పంపకంపై చర్చలు జరగలేదన్నారు. కశ్మీర్లో ఉన్న డ్యామ్‌ల నుంచి ఇసుకను తీసివేసేందుకు కూడా అనుమతులు లేని విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు ఆరోపించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసి, మన డ్యాముల్లో నీటి సామర్థ్యాన్ని పెంచుతుంటే, పాకిస్థానీలు ఆగ్రహానికి గురవుతున్నారని తెలిపారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను 1947లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తమ ఆర్మీతో వెనక్కి తీసుకోవాలని భావించారన్నారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో భారత దేశం 11వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు మన దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారిందన్నారు. ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ను దాటేసినప్పుడు సంతోషంగా ఫీలయ్యామని, ఎందుకంటే ఆ దేశం మనల్ని పాలించిందని, ఎప్పుడు 3వ స్థానానికి వెళ్లాలన్న వత్తిడి ఇప్పుడు దేశంపై ఉందన్నారు. పొరుగు వాళ్లు కూడా సంతోషంగా ఉండాలన్న భావన ఉందని, కానీ మన సామర్థ్యాన్ని సవాల్ చేస్తే, అప్పుడు భారత్ హీరోలకు నిలయంగా మారుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
మన శరీరం ధారుఢ్యంగా ఉన్నా.. ఒక చిన్న ముల్లు గుచ్చినా.. దాని వల్ల నొప్పి ఉంటుందని, మనకు నొప్పిని కలిగిస్తున్న ఉగ్రవాదం అనే ఆ ముల్లును శాశ్వతంగా పీకేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.