Terrorism | జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు రిక్రూట్మెంట్లు నిర్వహించే పద్ధతుల్లో సైతం మార్పులు కనిపిస్తున్నది. సరిహద్దుల్లోకి చొరబడడం మాని అంతర్గత ప్రాంతాల్లో దాక్కొని దాడులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదులకు స్థానికంగా తక్కువ మంది మాత్రమే సహకారం అందిస్తున్నట్లుగా సైన్యం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో 79 మంది పీర్ పంజాల్లో ఉన్నారు. 18 మంది స్థానికులు, 61 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా. పీర్ పంజాల్‌కు దక్షిణాన 40 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో 34 మంది పాకిస్థానీలు కాగా.. ఆరుగురు స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. సమాచారం మేరకు.. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 25 ఉగ్రవాద ఘటనలు రికార్డయ్యాయి. ఈ ఘటనల్లో 24 మంది జవాన్లు అమరులయ్యారు. గతేడాది ఈ సంఖ్య 27గా ఉన్నది.
ఈ ఏడాది 61 మంది ఉగ్రవాదులు హతమవగా.. ఇందులో ఇంటీరియర్‌లో 45 మంది.. నియంత్రణ రేఖ వద్ద 16 మంది మరణించారు. ఇందులో 21 మంది పాక్ ఉగ్రవాదులు ఉన్నారు. ఇక నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ వైట్ నైట్ కార్ప్స్‌ని సందర్శించారు. సైనిక సన్నద్ధతపై సమీక్షించారు. అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ముమ్మరం చేయాలని భద్రతా బలగాలను ఆదేశించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం సైన్యం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తూ వస్తోన్నది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో వృత్తి నైపుణ్యం, అప్రమత్తత పాటించాలని నార్తర్న్ కమాండ్ చీఫ్ ఆర్మీని కోరినట్లు ఆర్మీ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం కిష్త్వార్లోని కేష్వాన్ అడవుల్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన జేసీఓ రాకేశ్‌కుమార్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అలాగే, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.