Radhika Yadav : టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని పోస్టుమార్టం రిపోర్టు (Autopsy report) లో తేలింది. రాధికా యాదవ్ గురువారం ఉదయం 10.30 గంటలకు కన్న తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) చేతిలో దారుణ హత్యకు గురైంది. కిచెన్‌లో పనిచేస్తున్న బిడ్డ రాధికపై దీపక్ యాదవ్ వరుసగా నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని తన నివాసంలోనే దీపక్ యాదవ్ తన కుమార్తెను కాల్చిచంపాడు. తన బిడ్డను తానే హత్య చేసినట్లు ఆయన పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీని నడపడం నచ్చకనే దీపక్ యాదవ్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాధిక టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో అందరూ కూతురు సంపాదనపై బతుకుతున్నావని ఎగతాళి చేయడం దీపక్ యాదవ్‌కు నచ్చలేదు.
దాంతో కూతరును టెన్నిస్ అకాడమీని మూసేయమని పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోక పోవడంతో హత్యచేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పాడని తెలిసింది. తనకు కావాల్సినంత సంపద ఉందని, నెలనెలా ఇంటి అద్దెలు వస్తాయని, తన కూతురు అకాడమీ పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదని, ఆ మాట చెప్పినా వినకపోవడంతోనే చంపేశానని దీపక్ చెప్పినట్లు సమాచారం. ఇదిలావుంటే రాధికకు ఓ వ్యక్తితో ఉన్న లవ్ ఎఫైరే హత్యకు కారణమని మరో వార్త వినిపిస్తోంది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రానుంది.
కాగా రాధికా యాదవ్ ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. 2018లో కామర్స్‌లో 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసింది. పాఠశాల వయస్సులోనే ఆమె టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇటీవల ఆమె భుజానికి గాయం కావడంతో ఫిజియోథెరపీ చేయించుకుంటోంది. అయినా అకాడమీని ఆపకుండా యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తోంది. రాధిక ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేదని, ట్రోఫీలు గెలిచినప్పుడల్లా తన తండ్రితో కలిసి నృత్యం చేస్తూ రీల్స్ తీసుకునేదని తెలుస్తోంది.