కోల్‌కతా: వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. దీంతో ఆమెతో రిలేషన్షిప్ ఉన్న జూనియర్ డాక్టర్‌పై విద్యార్థిని తల్లి పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. (Tale Of Two Bengal Doctors) పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పురులియా జిల్లాకు చెందిన ఉజ్వల్ సోరెన్, మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చదువుతున్న 24 ఏళ్ల మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ ఏడాదిగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ మహిళ గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట ఒక గుడిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
కాగా, సెప్టెంబర్ 8న వైద్య విద్యార్థిని తన తల్లి వద్దకు వెళ్లింది. సెప్టెంబర్ 12న మాల్దాలో ఉంటున్న ఉజ్వల్ సోరెన్ తన వద్దకు రమ్మని ఆమెకు ఫోన్ చేశాడు. అయితే అతడిని కలిసేందుకు వెళ్లిన వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె నోటి నుంచి నురుగ వచ్చింది. దీంతో అధిక మోతాదు మందుతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు తన కుమార్తె మరణానికి ఆమె ప్రియుడు ఉజ్వల్ కారణమని ఆమె తల్లి ఆరోపించింది. కోర్టు వివాహం కోసం తన కూతురు పట్టుబట్టడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని గురించి వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, ఈ నేపథ్యంలో తన కుమార్తె మరణించినట్లు ఆరోపించింది.
కాగా, అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల వైద్య విద్యార్థిని మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఉజ్వల్ సోరెన్ ఆచూకీని గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. మృతురాలి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Earthquake | అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లో ప్రకంపనలు
Asaduddin Owaisi | 26 మంది ప్రాణాల కంటే డబ్బు విలువైనదా?.. భారత్, పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఆగ్రహం
Watch: టోల్ ప్లాజా వద్ద పేలిన లారీ టైరు.. తర్వాత ఏం జరిగిందంటే?