న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. (SIR Phase 3) హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశం మొత్తం ‘సర్’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, దేశ రాజధాని ఢిల్లీ, చండీగఢ్, దాద్రా- నగర్ హవేలి- దమన్-దియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ ‘సర్’ ప్రక్రియ నిర్వహించనున్నారు.
కాగా, ‘సర్’ మూడో దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), జనాభా గణనకు రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏల) సహాయంతో ఇంటింటికి వెళ్లి 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలు తనిఖీ చేస్తారని ఈసీ తెలిపింది. మే 30 నుంచి అక్టోబర్ 14 వరకు ‘సర్’ మూడో దశ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. జూలై 5 నుంచి అక్టోబర్ 21 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.

Sir Phase 3 Full Schedule