పాట్నా, అక్టోబర్ 23: నువ్వా? నేనా? అన్నట్టు పోటాపోటీగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాఘట్బంధన్ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంపై కొద్ది రోజులుగా తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో ఎట్టకేలకు పాట్నాలో జరిగిన కూటమి పార్టీల సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తేజస్వీ యాదవ్‌ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. యువకుడు, అంకిత భావం ఉన్న తేజస్వీ యాదవ్‌ను తమ కూటమి సీఎంగా ప్రకటించామని పేర్కొన్న గెహ్లాట్ హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. మా సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్.. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించగలరా? అని ఆయన అమిత్ షాను ప్రశ్నించారు.
తేజస్వీ యాదవే సీఎంగా ఉండాలని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కోరుకున్నారన్నారు. అలాగే తాము అధికారంలోకి వస్తే వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముకేశ్ సహానీని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని గెహ్లాట్ ప్రకటించారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కూటమిలోని పార్టీలన్నింటికీ కృతజ్ఞతలు తెలిపిన తేజస్వీ యాదవ్ బీహార్ పునర్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎన్డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్‌కు అన్యాయం జరుగుతున్నదని, ప్రతి ఎన్నికలో నితీశ్ కుమారే సీఎం అంటూ అమిత్ షా ప్రకటించే వారని, ఈసారి అలా ఎందుకు చేయలేదని అంటూ ఇది నితీశ్‌కు ఆఖరి ఎన్నికలని, ఆ విషయాన్ని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు.