పాట్నా: బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించారు. ముజఫర్పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీహార్లోని 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. అది బొచాహన్ లేదా ముజఫర్పూర్ నియోజకవర్గమా అని కాదు.. అన్ని స్థానాల్లో తేజస్వీ ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను పనిచేస్తానని, ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
అయితే కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమిలో ఇటీవల జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాత్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ చేరాయి. దీంతో సీట్ల పంపకం సంక్లిష్టంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయగా 75 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 70 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్ 19 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. ఓటర్ల హక్కులు, ఓట్ల చోరీ అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఇటీవలే రాహుల్ గాంధీ ఓట్ అధికారి యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ బలం పుంజుకుందని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో.. తాము అన్ని స్థానాల్లో పోటీచేస్తామని తేజస్వీ ప్రకటించడం కూటమిలో గందరగోళాన్నిసృష్టించింది.