స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఇలాంటి ఘటనే జరిగింది. తిత్వాలా ప్రాంతానికి చెందిన ఒక స్కూల్లో విద్యార్థికి ఘోరమైన అనుభవం ఎదురైంది.
ఇంట్రవెల్ టైంలో టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో సదరు విద్యార్థి.. మరో అబ్బాయిని నెట్టాడు. ఈ విషయంలో ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్లాడు మాథ్స్ టీచర్ వద్దకు వెళ్లి తాను మూత్ర విసర్జన చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చి నెట్టాడని ఆ విద్యార్థిపై ఫిర్యాదు చేశాడు. అంతే, సదరు స్టూడెంట్ను పిలిచిన ఆమె.. కర్రతో పిల్లాడి మణికట్టు విరిగేలా కొట్టింది.
స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికెళ్లిన ఆ విద్యార్థి చెయ్యి విపరీతంగా నొప్పిగా ఉందన్నాడు. దాంతో ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించగా.. మణికట్టు విరిగినట్లు తేలింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి సదరు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన స్కూల్ యాజమాన్యం కూడా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.