న్యూఢిల్లీ: తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్’ కింద ఈ నిధులు కేటాయించింది. చెన్నై నగరంలో వరద ఉపశమన ప్రాజెక్టు కోసం రూ. 561.29 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. చెన్నై నగరం వరదలను తట్టుకునేందుకు ఈ ఉపశమన నిధులు సహాయపడతాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, చెన్నైలో వరదల నివారణకు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద విడుదల చేసే నిధుల్లో ఇవి తొలి భాగమని అమిత్ షా తెలిపారు. ‘చెన్నై పెద్ద వరదలను ఎదుర్కొంటోంది. గత ఎనిమిదేళ్లలో సంభవించిన వరదల్లో తాజాది మూడవది. మెట్రోపాలిటన్ నగరాల్లో అధిక వర్షపాతం నమోదుకావడం, ఆకస్మిక వరదలకు దారితీయడం వంటివి మనం చూస్తున్నాం. జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఫర్ చెన్నై బేసిన్ ప్రాజెక్ట్’ కోసం రూ.561.29 కోట్ల మొదటి దశ వరద ఉపశమన నిధులకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఇందులో కేంద్ర సాయం రూ. 500 కోట్లు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.