Tamil Nadu | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా ఓ యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ మరియు ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది.
అయితే, జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది. ఈ అంశంలో స్టాలిన్ ప్రభుత్వం తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గతేడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (Project Approval Board) సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ఆ తర్వాత ఈ పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. ఈ నిధులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్లో వివరించింది.
Also Read..
National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణలు
Jyoti Malhotra | బ్లాకౌట్ వివరాలను పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసిన జ్యోతి మల్హోత్ర..!
Enforcement Directorate: యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అక్రమంగా 6000 కోట్లు దారిమళ్లించారు: ఈడీ