Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. జ్యోతి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఇక ఈ దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల (Pakistani intelligence officials)తో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి అంగీకరించినట్లు తెలిసింది.
ఈ మేరకు సంబంధిత అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్ని ఆమె దర్యాప్తు అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో డానిష్‌తో తొలిసారి పరిచయం ఏర్పడినట్లు వెల్లడించింది.
ఇక మన దేశంలోని కీలక ప్రాంతాల గురించి పాక్ ఏజెంట్లకు జ్యోతి సమాచారం ఇచ్చినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాక్‌కు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు తాజాగా తేలింది. సరిహద్దు గ్రామాలపై పాక్ దాడుల నేపథ్యంలో అక్కడ భారత ప్రభుత్వం బ్లాకౌట్‌ను (blackout details) నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ బ్లాకౌట్ సమాచారాన్ని కూడా డానిష్‌కు చేరవేసినట్లు సమాచారం. దర్యాప్తు బృందం ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి, మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమెకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక నేటితో ఆమె పోలీసు కస్టడీ ముగియనుంది.
కోడ్ భాషలో వాట్సాప్ చాట్స్
పాకిస్థానీ ఏజెంట్లతో ఆమె క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించినట్లు విచారణలో తేలింది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్, వాట్సాప్‌లో కోడ్ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్, జ్యోతి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు వెలుగుచూసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారతదేశ అండర్‌కవర్ ఆపరేషన్లకు సంబంధించి సంకేత భాషలో వారి మధ్య సాగిన సంభాషణలు దర్యాప్తు బృందానికి లభించాయి.
Also Read..
“Jyoti Malhotra | జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం.. వెలుగులోకి కీలక విషయాలు”
“Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతికి షాక్.. ఇన్‌స్టా ఖాతా సస్పెండ్”