Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థానీ ఏజెంట్లతో ఆమె క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించినట్లు విచారణలో తేలింది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్, వాట్సాప్‌లో కోడ్ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
తమ కస్టడీలో ఉన్న జ్యోతిపై దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు, అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీ గురించి ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. జ్యోతి పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ పర్యటనలపై కూడా ఆరాతీస్తున్నారు. ఈ విషయాన్ని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సవాన్ వెల్లడించారు. అంతేకాదు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు (Pak – Afghan border) వరకు ఆమె సంబంధాలను ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలో పాక్ రాయబారి డానిష్‌తో సంబంధాలపై ఆమె బుకాయించినట్లు తెలిసింది.
సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను సందర్శించింది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌తో పంచుకున్నట్లు తేలింది. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది.
ఉగ్రదాడికి ముందు పహల్గాంకు!
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె పహల్గాంకు వెళ్లినట్టు తేలింది. అక్కడ తీసిన వీడియోలను పాక్‌లోని ఐఎస్ఐ అధికారులకు ఆమె చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్థాన్‌కి కూడా జ్యోతి ప్రయాణించినట్లు హిసర్ పోలీసులు వెల్లడించారు. ఓ పాకిస్థానీ పౌరుడితో తరచూ సంప్రదింపులు జరిపిన జ్యోతి ఐఎస్ఐకి అస్త్రంగా మారిపోయిందని హిసర్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు.
Also Read..
“Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతికి షాక్.. ఇన్‌స్టా ఖాతా సస్పెండ్”
“Jyoti Malhotra | పాక్ గూఢచారి జ్యోతితో ఒడిశా యూట్యూబర్‌కు లింకులు?”