చెన్నై: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు. (Tamil Nadu SIR draft) 66,44,881 మంది ఓటర్లు బదిలీ అయినట్లుగా, 3,39,278 మంది ఓటర్లు పలు ప్రదేశాల్లో నమోదు చేసుకున్నట్లుగా, 26,94,672 మంది ఓటర్లు మరణించినట్లుగా జాబితాలో పేర్కొన్నారు.
కాగా, 2025 అక్టోబర్ 27 నాటికి తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ‘సర్’ ప్రక్రియలో 97 లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించడంతో ప్రస్తుతం 5.43 కోట్ల మంది ఓటర్లు మిగిలారు. వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
మరోవైపు ‘సర్’ ప్రక్రియలో భాగంగా రాజధాని చెన్నైలో అత్యధికంగా 14.25 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీంతో చెన్నై ఓటర్ల సంఖ్య 40.04 లక్షల నుంచి 25.79 లక్షలకు తగ్గింది. 12.22 లక్షల మంది ఓటర్లు బదిలీ అయినట్లు, 1.56 లక్షల మంది మరణించినట్లు, 27,323 మంది ఓటర్లు చిరునామాలో కనిపించలేదని, 18,772 ద్వంద్వ ఓటింగ్ కేసులు ఉన్నట్లు ముసాయిదా ఓటర్ జాబితాలో పేర్కొన్నారు.
కాగా, కోయంబత్తూరులో 6.50 లక్షలు, దిండిగల్ జిల్లాలో 2.34 లక్షల మంది ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కరూర్‌లో 79,690 మంది ఓటర్లను, కాంచీపురం జిల్లాలో 2.74 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
మరోవైపు షోలింగనల్లూరు, పల్లవరం నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు నమోదైనట్లు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు. కొన్ని వర్గాల ఓటర్లను తొలగించినట్లుగా వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఏ ఓటరు పేరును ఏకపక్షంగా తొలగించలేదని మీడియాతో అన్నారు.
Also Read:
Opposition Sits On Overnight Protest | జీ రామ్ జీ బిల్లు ఆమోదంపై.. రాత్రంతా ప్రతిపక్షాల నిరసన
Watch: వీధిలో ఆడుతున్న బాలుడు.. ‘ఫుట్‌బాల్’ మాదిరిగా తన్నిన వ్యక్తి