లక్నో: ఒక క్లయింట్‌కు సహాయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళా న్యాయవాదిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆమెను శారీరకంగా హింసించడంతో పాటు లైంగికంగా వేధించారు. ఆ మహిళా లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరింది. (Supreme Court) డిసెంబర్ 3న అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళా న్యాయవాది ఒక క్లయింట్‌కు సహాయంగా ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 126లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన క్లయింట్ వినయ్ సింఘాల్ ఫిర్యాదుపై తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పట్టుబట్టింది.
కాగా, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు పోలీసులు ఆ మహిళా న్యాయవాదిని అక్రమంగా నిర్బంధించారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమెను శారీరకంగా హింసించారు. లైంగికంగా వేధించారు. మహిళా లాయర్ ధరించిన నల్లకోటును చించారు. రహస్య వీడియో రికార్డర్ కోసం ఆమె దుస్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తన శరీరాన్ని తాకి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది.
అంతేగాక ఆ మహిళా లాయర్ మెడపై పోలీస్ అధికారి పిస్టల్ ఉంచాడు. ఆమె మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని బలవంతం చేశాడు. లేకపోతే ‘నకిలీ ఎన్కౌంటర్’లో చంపుతానని బెదిరించాడు. మహిళా న్యాయవాది, క్లయింట్ మొబైల్స్ ఫోన్స్‌లో రికార్డ్ చేసిన వీడియో ఆధారాలను బలవంతంగా పోలీసులు డిలీట్ చేసినట్లు ఆమె పేర్కొంది.
మరోవైపు సుమారు 14 గంటల పాటు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు, లైంగిక వేధింపులు అనుభవించిన ఆ మహిళా న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన ప్రాణానికి, స్వేచ్ఛకు ముప్పు వాటిల్లినట్లు ఆరోపించింది. ఈ విషయంలో కోర్టు ప్రత్యేక జోక్యాన్ని కోరింది.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సెక్టార్ 126 నోయిడా పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను జనవరి 7 లోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఆ వ్యవధికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తొలగించకుండా చూడాలని నోయిడా పోలీస్ కమిషనర్‌కు సూచించింది.
Also Read:
Opposition Sits On Overnight Protest | జీ రామ్ జీ బిల్లు ఆమోదంపై.. రాత్రంతా ప్రతిపక్షాల నిరసన
Watch: బావిలో పడిన కుమార్తె.. కాపాడేందుకు అందులోకి దూకిన తండ్రి