చెన్నై, డిసెంబర్ 21: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే పొన్ముడికి మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది.
ఇదే కేసులో మంత్రి భార్య పి విశాలాక్షికి సైతం మూడేండ్ల కారాగారాన్ని విధించడమే కాక, ఇద్దరూ 50 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని జస్టిస్ జీ జయచంద్రన్ తీర్పు చెప్పారు. 30 రోజుల తర్వాత విల్లిపురం కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. అవినీతి నిరోధక చట్టం కింద మంత్రికి జైలు శిక్ష పడటంతో ఆయన మంత్రి పదవిని కోల్పోవడమే కాక శాసనసభ్యుని పదవికి సైతం అనర్హుడయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు తెలిపారు.