Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెన్నైలోని లోక్‌భవన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్.. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో కూటమిలోని కాంగ్రెస్‌కు మాత్రమే చోటు దక్కింది.
కూటమిలో ఉన్న వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు ఎలాంటి పదవులూ కేటాయించలేదు. కాంగ్రెస్ నుంచి రాజేష్ కుమార్, విశ్వనాథన్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉంది. గతంలో అధికార డీఎంకేతో కూటమిలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌కు మంత్రి పదవులు మాత్రం దక్కలేదు. సీఎన్ అన్నాదురై 1967లో డీఎంకే పార్టీని స్థాపించి, అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీపై ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతే.. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ అక్కడ కాంగ్రెస్ గెలవలేదు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసి, కొన్ని స్థానాలు సాధించినా మంత్రి పదవులు మాత్రం దక్కలేదు.
తాజాగా ఎంపికైన 23 మంది మంత్రులకు శాఖలను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 23 మంది మంత్రుల జాబితా ఇది. ఏ. శ్రీనాథ్, కమాలి ఎస్, సీ విజయ లక్ష్మి, ఆర్వి. రంజిత్ కుమార్, ఆర్ వినోద్, రాజీవ్, బి.రాజ్ కుమార్, వి.గంధిరాజ్, మదన్ రాజా, జగదేశ్వరి, విజయ్ బాలాజీ, లోగేష్ తమిళ్ సెల్వన్, విజయ్ తమిళన్ పార్తీబన్, రమేష్, ఆర్ కుమార్, కే తెన్నారసు, వి సంపత్ కుమార్, మొహమ్మద్ ఫర్వాస్, డి శరత్ కుమార్, ఎన్ మారీ విల్సన్, కే విగ్నేష్ టీవీకే నుంచి మంత్రి పదవులు పొందగా, రాజేష్ కుమార్, విశ్వనాథన్ కాంగ్రెస్ నుంచి మంత్రులుగా ప్రమాణం చేశారు.