Delhi heat : దేశరాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోతోంది. ఎండలు మండిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ వారంమంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరనున్నట్లు వెల్లడించింది. అలాగే, భారీగా వడగాడ్పులు వీస్తాయని కూడా హెచ్చరించింది. దీని ప్రకారం.. ఎండలో బయటకు వెళ్లడం అసౌకర్యంగా కాదు.. ప్రమాదకరమే అని నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే ఢిల్లీలో 40 డిగ్రీలకు పైగా ఎండకాస్తోంది. శనివారం 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడినే ఢిల్లీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది మరో ఐదు డిగ్రీల ఎండలు పెరగడమంటే సాధారణ విషయం కాదు. ఢిల్లీ వైపు తూర్పు నుంచి వీచే గాలుల దిశ మారడం వల్లే ఈ పరిస్తితి ఉందని నిపుణులు అంటున్నారు. ఈ గాలులు కాస్త చల్లదనాన్ని, తేమను అందిస్తాయి. కానీ, ఇప్పుడు రాజస్థాన్, పాకిస్తాన్ నుంచి వాయువ్య దిశలో వేడి గాలులు వీస్తుండటం వల్ల ఎండ, వేడి పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ గాలుల్లో ఎలాంటి తేమ ఉండదు.ఈ కారణంగా ఎండలు దాదాపు నాలుగైదు డిగ్రీలు పెరగవచ్చు. మే 23 వరకు ఇదే తరహా ఎండలు కాసే అవకాశం ఉంది.
ఢిల్లీలోనే కాకుండా పంజాబ్, హరియాణా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, విదర్భ, చత్తీస్గఢ్లకు కూడా భారీ ఎండలు తప్పవని ఐఎండీ తెలిపింది. విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 46 డిగ్రీల ఎండ నమోదవుతోంది. ఢిల్లీలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని సీఎం రేఖా గుప్తా.. ప్రైవేటు కంపెనీలకు సూచించారు.