సోన్‌భద్ర(యూపీ), మే 12: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపుపై స్వామి అవిముక్తేశ్వరానంద స్పందించారు. ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరడానికి ముందు ప్రభుత్వం రూ. 8,000 కోట్ల విమానాన్ని విక్రయించి ఇంధనాన్ని తక్కువగా ఖర్చుచేసే విమానాలను ఉపయోగించాలని ఆయన హితవు చెప్పారు. తన గోవిష్ట్ యాత్ర సందర్భంగా సోన్‌భద్రలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెరికన్ డాలరు విలువ రూ. 100కు చేరుకుంటున్నదని గుర్తుచేస్తూ పొదుపు చర్యలు ముందుగా అధికారంలో ఉన్న వారి నుంచే మొదలు కావాలని సూచించారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగాన్ని నివారించాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తి గురించి విలేకరులు అడుగగా ముందుగా రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మి ఇంధనాన్ని ఆదా చేసే విమానాన్ని వాడండి. ధర్మం ఇంటి నుంచే మొదలవుతుంది అని స్వామీజీ అన్నారు.
పశ్చిమ బెంగాల్, కేరళతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో గోవుల సంఖ్య చాలా వేగంగా క్షీణించిందని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య వెల్లడించారు. గోవధను ఆపడంలో రాజకీయ పార్టీలు, నాయకులు విఫలమైన కారణంగా తాను ఇప్పుడు ఓటర్లను చైతన్యవంతం చేయడంపై పనిచేస్తున్నానని ఆయన అన్నారు.