Surya Tilak | శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక రేపు నవమి సందర్భంగా ఆలయంలో బాల రాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు.
అంతేకాదు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం (Surya Tilak) దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నవమి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం మూడో అంస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. మూడున్నర నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది.
Also Read..
Artificial Intelligence | ఏఐ నకిలీ మకిలి.. చాట్‌జీపీటీతో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు
Passport | శక్తివంతమైన పాస్‌పోర్టుల్లో మరింత దిగజారిన భారత్ ర్యాంకు