Passport | న్యూఢిల్లీ: ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత ర్యాంకు మరింత దిగజారింది. నిరుడు 147వ ర్యాంకు ఉండగా, ఈ ఏడాది 148వ ర్యాంకుకు పడిపోయింది. 199 దేశాలతో రూపొందించిన నొమడ్ క్యాపిటలిస్ట్ పాస్‌పోర్ట్ సూచీ-2025లో ఉత్తర యూరప్ దేశం ఐర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. వీసా రహిత ప్రయాణం (50%), పన్ను విధింపు (20%), ప్రపంచ దృక్కోణం (10%), ద్వంద్వ పౌరసత్వం(10%), వ్యక్తిగత స్వేచ్ఛ (10%) పరామితుల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. తాజా ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్, గ్రీస్ రెండో ర్యాంక్‌లో, అమెరికా 45వ స్థానంలో నిలిచాయి.
ఇప్పటివరకు 682 మంది వెనక్కి అమెరికా బహిష్కరణపై కేంద్రం
న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో ఏప్రిల్ 4 వరకు మొత్తం 682 మంది భారతీయులను అమెరికా దేశం నుంచి బహిష్కరించిందని విదేశాంగ శాఖ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది అక్రమంగా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారేనని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అమెరికాలో భారతీయుల అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లు, ఇతర నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అమెరికాలోకి ఎంతమంది భారతీయులు అక్రమంగా ప్రవేశించారనే సమాచారం తమ వద్ద ఉండదని.. అమెరికా వద్దే ఉంటుందని వెల్లడించారు. అమెరికా బహిష్కరించే భారతీయుల వివరాలను సంబంధిత భారత ప్రభుత్వ విభాగాలు నిశితంగా పరిశీలించి.. వారు భారతీయులైతేనే స్వదేశానికి అనుమతిస్తాయని కీర్తివర్ధన్ చెప్పారు.