Piyush Goyal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేధపై పనిచేస్తుండగా, భారత్‌లో అనేక స్టార్టప్‌లు ఆహార పదార్థాల డెలివరీ, బెట్టింగ్, స్పోర్ట్స్, గేమ్స్ యాప్‌లపై దృష్టి పెట్టాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఢిల్లీలో నిర్వహించిన స్టార్టప్ మహాకుంభ్‌లో ఆయన మాట్లాడారు. తక్కువ ఆదాయం వచ్చే చిల్లర వ్యాపారాలతోనే సంతృప్తి చెందుతారా అని ఆయన ప్రశ్నించారు. ‘ఐస్‌క్రీమ్‌లు లేదా చిప్స్ తయారు చేద్దామా? దుకాణ్దారీ హీ కర్నా హై? (దుకాణాలే నడుపుదామా)?’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 100కు పైగా యూనికార్న్‌లతో భారత్ మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఉంది. సుమారు 1.57 లక్షల స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపు పొందాయి. స్టార్టప్‌లు తాము నిర్దేశించుకున్న లక్ష్యంపై పునరాలోచన చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. డెలివరీ బాయ్స్, గర్ల్స్‌గా ఉండిపోదామా? భారతదేశపు గమ్యం ఇదేనా? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేడు భారత్‌లోని స్టార్టప్‌లు ఏం చేస్తున్నాయి? ఫుడ్ డెలివరీ యాప్‌లపై దృష్టి పెడుతున్నాం. సంపన్నులు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంటికే తమ భోజనం తెప్పించుకునేలా నిరుద్యోగ యువతను చౌకగా వచ్చే కార్మికులుగా మార్చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. కేవలం రూ.25 లక్షలకో లేదా రూ.50 లక్షలకో ఓ స్టార్టప్ ఆలోచనను విదేశీ కంపెనీలకు అమ్ముకున్నారని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని చెప్పారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్టార్టప్‌లపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. గోయల్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. భారతీయ స్టార్టప్‌లు చాలా వినూత్నమైనవని కొనియాడారు. మనకు అంతరిక్ష సాంకేతికత నుంచి ఫిన్ టెక్, రోబోటిక్స్ వరకు అనేక రకాల స్టార్టప్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. మన పురాతన చట్టాలు, సుంకాలు, నిబంధనలు విధించిన అన్ని అడ్డంకులను అధిగమించి అవి బాగా పనిచేశాయని స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలను జెప్టో సీఈవో ఆదిక్ పలీచా, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ మోహన్‌దాస్ పాయ్ తప్పు పట్టారు. ప్రభుత్వం ‘స్థానిక చాంపియన్లను’ సృష్టించేందుకు మద్దతునివ్వాలని, వారికి సహకరిస్తున్న సంస్థలను నిరుత్సాహపరచకూడదని అన్నారు.