న్యూఢిల్లీ: ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్)లకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించరాదంటూ గతంలో విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు బుధవారం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారిస్తూ ఈఎస్జడ్ల కింద ఉన్న రక్షిత అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో అభివృద్ధి పనులు నిర్వహిస్తే పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతాయని గత ఏడాది జూన్లో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సవరించింది.
2022లో నిపుణుల కమిటీ ఈఎస్జడ్లపై జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం తాము గతంలో కొన్ని అంశాలపై విధించిన నిషేధం ఉత్తర్వు సబబు కాదని నిర్ణయించామని, దీంతో గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే జాతీయ పార్కులకు కిలోమీటర్ దూరం పరిధిలో గనుల తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈఎస్జడ్ల పరిధిలో ఉండే లక్షల కుటుంబాల జీవనోపాధిపై కోర్టు ఉత్తర్వులు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని, జీవావరణ సంబంధ అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నందున ఆ ఉత్తర్వును నిలిపివేయాలని కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.