న్యూఢిల్లీ, జూలై 29: తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించగా.. కోర్టు రూమ్‌లోకి మీడియా కెమెరాలను కూడా అనుమతించారు. సుప్రీంకోర్టు 75 వసంతాల సంబురాల సందర్భంగా పెండింగ్ కేసులను స్నేహపూర్వక రీతిలో సెటిల్మెంట్ చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు. లోక్ అదాలత్‌ను శుక్రవారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి కేసులేమైనా ఉంటే బెంచ్ ముందుకు తీసుకురావాలని లాయర్లకు సూచించారు. అంతకుముందు సీజేఐ ఓ వీడియో సందేశంలో.. సుప్రీం కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులను స్నేహపూర్వక రీతిలో, వేగంగా పరిష్కరించుకోవాలనుకుంటే ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.