న్యూఢిల్లీ: ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని విడుదల చేయడంలో జాప్యం చేసిన జైలు అధికారులపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్టం కింద అరెస్టైన వ్యక్తికి ఏప్రిల్ 29న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 27న ఘజియాబాద్‌లోని ట్రయల్ కోర్టు కూడా అతడికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత బాండ్ పూచికత్తుతో జైలు నుంచి విడుదల చేయాలని జైలు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వు జారీ చేసింది.
కాగా, ఆ వ్యక్తిని విడుదల చేసేందుకు జైలు అధికారులు జాప్యం చేశారు. చివరకు జూన్ 24న ఘజియాబాద్ జిల్లా జైలు నుంచి అతడు విడుదలయ్యాడు. అయితే బెయిల్ మంజూరైనప్పటికీ తన విడుదలలో జాప్యంపై ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తులు కేవీ విశ్వనాథన్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఉత్తరప్రదేశ్ జైలు అధికారులపై తీవ్రంగా మండిపడింది.
మరోవైపు స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రకారం హామీ ఇచ్చిన చాలా విలువైన హక్కు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. నిందితుడికి తాత్కాలిక పరిహారం కింద ఐదు లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆ వ్యక్తి విడుదలలో జాప్యంపై ఘజియాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని, ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Also Read:
Tej Pratap | కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూలో.. తేజ్ ప్రతాప్ పాస్
Couple Kills Disabled Man | దివ్యాంగుడ్ని చంపిన దంపతులు.. సిమెంట్‌తో నింపిన ట్రంక్‌పెట్టెలో మృతదేహం